Bhadrachala Ramadasu Kirtanalu
అంతా రామమయంబీ జగమంతా రామమయం
అంతరంగమున నాత్మారాముం
డనంతరూపమున వింతలు సలుపగ
సోమసూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేద శాస్త్రములు
అష్టదిక్కులును ఆదిశేషుడును
అష్టవసువులను అరిషడ్వర్గము
ధీరుడు భద్రాచల రామదాసుని
కోరికలొసగెడి రామనామము
అడుగుదాటి కదలనియ్యను నాకభయమియ్యక నిన్ను విడువను
గడియ గడియకు తిరిగి తిరిగి యడిగితిని వేసారవచ్చెను
గడువు దప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను
కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను
మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదు గద
నా హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును
రేపు మాపని జరిపితే నేనాపుజేసెడివాడ గాను
ప్రాపు నీవని నమ్మి గొలిచిన పాపముల నెడబాసి దయతో
తేపతేపకు నీదు మోము చూపకుండిన నోర్వసుమ్మి
పతితపావన బిరుదు లేదా పాలనము నను సేయరాదా
ప్రతిదినంబును దేవ నిను భూపతి వటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను బ్రతిమాలినను విడబోను నిన్ను
రాక్షసాంతక భక్తవరదా సారసాక్ష సుజనరక్షక
యీ క్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివా నిను
సాక్షి బెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను
భూరి భద్రాచల నివాసా భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుం డనెడి నామము మారుపేరున బిలువు నన్ను
అబ్బబ్బ దెబ్బలకు తాళలేనురా
రామప్ప గొబ్బున నన్నేలుకోరా
మేలుచేయుదు నంటిగదరా
మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమజేస్తి గదరా
నీ పరిచారకులకు నే పెట్టితి గదరా
పరులకొక్క రువ్వ యీయలేదు గదరా
ఓ పరమాత్మ నీ పాదములే నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరి గదరా
హరనుత గోవింద హరి తాళలేరా
అంతటిలో నిన్ను నెరనమ్మినారా
శరణాగత శరధి బంధించిన శౌర్యమెక్కడరా
రాక్షససంహార రక్షింపరారా
రామ భద్రాద్రి సీతారామ రామ
నీ నామమెప్పుడు భజయించితి గదరా
రామదాసుని నిటుల చేయించితేరా
అబ్బబ్బ దెబ్బలకు నోర్వలేనురా
జాగు సేయకురా తబ్బిబ్బాయెనురా
అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య
రట్టు తీర్చీ వేళ గట్టిగా నీవు నను
చెట్టు బట్టి యేలుకో పట్టాభిరామా
శరణాగతత్రాన బిరుదాంకుడవు గాద
శరధి బంధించిన శౌర్యమేమాయెరా
పరంధామ నీ పాదములాన వినరా
పరులకొక్క కాసు నే నివ్వలేదురా
భద్రాద్రి శ్రీ రామ నీ నామమెపుడు
ప్రేమతో భజియించు రామదాసునేలు
అబ్బబ్బా రామనామం అత్యద్భుతం
గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది
సారము లేని సంసార సాగరమీదే రామనామం
పారద్రోలు మున్నూటరువది భవరోగములన్నీ
చేరి పంచేద్రియములన్ని చేరనియ్యదు రామనామం
ఘోరమైన యమదూతల కొట్టెడిది రామనామం
దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం
ధన కనక వస్తువులు దయచేయు రామనామం
ముక్కంటిసతికి శాశ్వత కీర్తినిచ్చె రామనామం
ఎక్కువై వాల్మీకి ఋషికి యెప్పుడును అనుష్ఠాన నామం
కామ క్రోధ లోభ మోహ గర్వంబు నణచు రామనామం
స్వామి భద్రగిరీశుని సద్గతి శ్రీ రామనామం
నియమముతో బిలిచినను నిత్య మోక్షపదవి నామం
రామదాసునేలిన శ్రీ రామచంద్రుని నామం
అమ్మ నను బ్రోవవే
రఘురాముని కొమ్మ నను గానవే
అమ్మ నను బ్రోవవె సమ్మతి తోడ
మా యమ్మ వనుచు నెమ్మది గొలిచెద
కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమె విభునితో
యుల్లములోన మీ యుభయుల నెరనమ్మి
యెల్ల వేళల వేడి వేసారితి నిపుడు
చలము మాని భద్రశైల రామదాసు
నలసట బెట్టక యాదరణ జేసి రా
అయ్యయో నీవంటి అన్యాయ దైవము
నెయ్యడ గానననయ్య శ్రీ రామయ్య
ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించ
వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర
ఎంతని వేడుదు ఎంతని పాడుదు
ఎంతని దూరుదు ఏమిసేతు రామ
సుంతైన గాని నీ అంతరంగమదేమో
వింత కరుగదు ఎంతో నమ్మినందుకు
శరణన్న జనముల బిరబిర బ్రోచేటి
బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ
మరుగు జొచ్చినందు కరమర జేయుట
పరువే కరుణింప బరువే హరి హరి
కామిత మందార కలుష విదూర
తామసమేల తాళజాలనురా నీ
మోము జూపుము స్వామి భద్రాచల
రామదాసుని ప్రేమ రయమున నేలుము
అయ్యయ్యో నే నేరనైతి
ఆదినారాయణుని తెలియనైతి
వెయ్యారు జన్మాల వెత జెందితి గాని
చెయ్యన సద్గతి సాధింప లేనైతి
మోసమేమని తలచి యుండు దోస
వాసనల తగిలితేమందు ఆశా
పాశములని అరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి
మూడు మేలని నమ్మియుంటి నిరు
మూడు శత్రుల కూడియుంటి మాటికి
రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన
కూటస్థు పొగడ నేను కూడ లేనైతి
వదలించి బంధముల విడజేసిన
భద్రగిరి రాఘవులతో నేను కలసి
సదయుడనై గని శ్రీ రామదాసుని
స్థిరముగ పోషించుడని వేడనైతి
అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు
సుఖమెయ్యెడ లేదు గదా రామయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమా
యే చందాన బ్రోచెదవో రామయ్య
వనజనాభుని మాయ తెలియకనే
వెఱ్ఱి వగల బొందుచుంటిగా కొన్నాళ్ళు
మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే
మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు
ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల
వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు
అయ్య ఆలంబనము లేక నాకాశమున
నలసట నొందితిగా కొన్నాళ్ళు
మేను తెలియక లేక మిన్ను లోపల
జిక్కి మినుకుగ నుంటిని గదా కొన్నాళ్ళు
ఈలాగు వచ్చి మేఘ మధ్యమునందు
నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు
జాలినొంద సూర్యకిరణములో జొచ్చి
చలనము నొందితిగా కొన్నాళ్ళు
వరుస సస్యగతమైన ధాన్యముల
వదిలి వర్తించితిగా కొన్నాళ్ళు
పురుషుడారగించు నన్నముతోనే
నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు





